ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ..‘గేమ్ ఛేంజర్’ చిత్రం విడుదలైన తర్వాత హీరో రామ్ చరణ్ గానీ, దర్శకుడు శంకర్ గానీ తమకు ఫోన్ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. మెగా అభిమానులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను, నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ హీరో సినిమాకు పూర్తి సహకారం అందించినా, ఈ విధంగా మాట్లాడటం సరికాదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే శిరీష్ వెంటనే స్పందించి వివాదాన్ని చల్లార్చేందుకు బహిరంగ లేఖను విడుదల చేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మెగా అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయాన్ని కేటాయించి, సంపూర్ణ సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తాను ఎప్పటికీ మాట్లాడనని శిరీష్ హామీ ఇచ్చారు..!!