ఇప్పటిదాకా టాలీవుడ్ హీరోలతో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ..ఈసారి బాలీవుడ్ వైపు కన్నేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ‘అన్ స్టాపబుల్’ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. రణబీర్ కపూర్ తో చేపట్టే ఎపిసోడ్ లో డైరెక్టర్ సందీప్ వంగా కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన సందీప్ వంగా..ప్రస్తుతం రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా ‘యానియల్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఈ క్రమంలో రణబీర్, సందీప్ వంగా..’ఆహా’ ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోలో సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమాన్ని బాలయ్య గత రెండు సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నారు. తనదైన శైలిలో కామెడీ పంచ్ లు, సెటైర్లు, ముక్కుసూటి ప్రశ్నలతో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇటీవల మూడో సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్ పాల్గొంది. ఇప్పుడు నెక్ట్స్ ఎపిసోడ్ లో ‘యానిమల్’ టీమ్ సందడి చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది..!!