సౌత్ మూవీస్ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఒక బాలీవుడ్ ఛానెల్ లో అనురాగ్ మాట్లాడుతూ.. ” పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్ ని నాశనం చేస్తుంది. ఒకప్పుడు ఈ ట్రెండ్ మాకు ఉండేది కాదు. కానీ ఈ మధ్యే ఈ పంథా కనిపిస్తుంది. సౌత్ నుండి పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలైన ‘పుష్ప’, ‘కాంతార’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించవచ్చు, కానీ అలాంటి సినిమాలను బాలీవుడ్ లో కాపీ కొట్టి దాన్ని పాన్ ఇండియాగా తీయాలని ప్రయత్నిస్తే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
ఇక ఇలాంటి చిత్రాలు వేల కోట్లు వసూళ్లు చేస్తున్నాయని మనం దానిని కాపీ కొట్టి తీస్తే బాలీవుడ్ లో వర్కౌట్ అవ్వదు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదని, ఇండస్ట్రీ కి ధైర్యాన్నిచ్చే సినిమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలని హితవు పలికారు అనురాగ్ కశ్యప్. కథలో కొత్తదనం ఉంటే బాలీవుడ్ అక్కున చేర్చుకుంటుందని నమ్మకం ఇచ్చాడు. సౌత్ బ్లాక్ బస్టర్స్ ని చూసి బాలీవుడ్ మేకర్స్ సైతం పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటం మంచిది కాదని వ్యాఖ్యానించాడు. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటుతుంటే. బాలీవుడ్ చిత్రాలు మాత్రం డిజాస్టర్స్ గా నిలుస్తుండటమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నాడు అనురాగ్..!!