వాణిశ్రీ తన నటనతో తెలుగు సినీ పరిశ్రమను శాసించిన కళాభినేత్రి. ఆమె తన నిజ జీవితంలో చేసిన న్యాయపోరాటం కధాంశంగా ఒక సినిమానే నిర్మించే ప్రయత్నం లో ఉన్నారట తమిళ నాట. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకొని వచ్చిన ఒక చట్టం “వాణిశ్రీ చట్టం” గ పిలవబడుతుంది. వాణిశ్రీ భర్త కరుణాకరన్ గారు 1970 లో చెన్నై లోని చోళైమేడు ప్రాంతం లో 9000 చదరపు అడుగుల స్థలం కొని అందులో కార్ బ్యాటరీలు తయారు చేసే కంపెనీ స్థాపించారు. కాలక్రమంలో ఆ ఫ్యాక్టరీ సరిగా నడవక దానిని మూసేసి, ఆ స్థలాన్ని వేరే వారికీ లీజ్ కి ఇచ్చేశారట. ఆ తరువాతి రోజుల్లో ఆ స్థలం విలువ కోట్లల్లోకి వెళ్ళింది, భూ బకాసురులు కళ్ళు దాని మీద పడ్డాయి, ఇంకేముంది అందులో ఉంటున్న వ్యక్తిని బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించారు. 2010 లో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాణిశ్రీ కోర్ట్ ను ఆశ్రయించారు, వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకట కార్తీక్ ఈ కేసు విషయం చూసుకుంటూ ఉండే వారు. కబ్జాదారుల ఆగడాలు పెరిగాయి, కేసు వాపసు తీసుకొని, ఆ భూమి ని తమకే చవకగా అమ్మాలని ఆయన మీద వత్తిడి పెంచారు, బెదిరించారు..
ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ మానసిక వేదనను భరించలేక 36 ఏళ్ళ వయసులోనే, ఆయన గుండెపోటుతో మరణించటం జరిగింది, ఈ సంఘటన అత్యంత విషాదకరం. కుమారుడి మరణం వాణిశ్రీ గారిని కుంగదీసింది, వయోభారం తో ఉన్న వాణిశ్రీ, ఆమె భర్త ఎంతకని పోరాడుతారు, కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు తప్ప, వారి వేదన పట్టించుకునేవారే లేరు. ఇటువంటి సమయం లోనే తమిళ నాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఇటువంటి భూ కబ్జా కేసులు సివిల్ కోర్ట్ కు వేళ్ళ వలసిన అవసరం లేకుండా, ఒక చట్టాన్ని చేసి, అటువంటి కేసులు కలెక్టర్ పరిధిలోకి తీసుకొని వచ్చి న్యాయ విచారణ చేసే వెసులుబాటును కల్పించింది. ఈ కొత్త చట్టం ప్రకారం మొదట ఒక అయిదు కేసులు విచారణ చేసి, చట్టపరం గ వారి భూములను వారికీ అప్పగించటం జరిగింది. అందులో వాణిశ్రీ గారి కేసు కూడా ఒకటి,తమిళ నాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వాణిశ్రీ గారి భూమి పత్రాలు ఆమెకు అప్పగించటం జరిగింది, ఆ రోజు కన్నీటి పర్యంతం అయిన వాణిశ్రీ గారు నా కొడుకే , స్టాలిన్ గారి రూపం లో ఈ భూమిని నాకు అప్పగించాడు అన్నారు. అప్పటినుంచి ఈ కొత్త చట్టాన్ని “వాణిశ్రీ చట్టం” అనటం మొదలుపెట్టారు..!!