సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో “ఘర్షణ” సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీసీపీ రామచంద్ర పాత్రలో వెంకీ అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుంది. వెంకీ పాత్ర అభిమానుల మనసులో చెరగని ముద్ర కూడా వేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్ మీనన్ ప్రస్తుతం తన “లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఓపెన్ అప్ అయ్యారు గౌతమ్ మీనన్. “ఈ మధ్యనే వెంకటేష్ గారిని కలిసి ఘర్షణ 2 గురించి మాట్లాడాను. ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు కానీ కచ్చితంగా వెంకటేష్ గారితో ఘర్షణ సీక్వెల్ తీస్తాను” అని చెప్పుకొచ్చారు గౌతమ్ మీనన్. అంతేకాకుండా “ఈ మధ్యనే డీవీవీ దానయ్య (ఆర్ ఆర్ ఆర్ నిర్మాత) ను కలిశాను. ఒక స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేశాం” అని అన్నారు గౌతమ్ మీనన్..!!