హీరోయిన్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేస్తోన్న విషయం విదితమే. అందులో కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ తాను 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పాడు. తమ దగ్గరి బంధువులు ఇద్దరు అప్పట్లో తనను లైంగికంగా వేధించారని, దాదాపు ఐదేళ్ల పాటు ఇటువంటి వేధింపులను కొనసాగించారని తెలిపాడు. ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఎవరూ అర్థం చేసుకోలేరని భావించి తన కుటుంబానికి ఈ విషయం గురించి చెప్పలేదని అన్నాడు..అనంతరం కంగనా రనౌత్ కూడా చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
చిన్నారులతో కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని, తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని తెలిపింది. తమ గ్రామంలో తన కంటే పెద్ద వాడైన ఓ వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా అనుచితంగా తాకుతూ ఉండేవాడని తెలిపింది. ఆ సమయంలో అతడి ఉద్దేశం ఏంటో తనకు అర్థం కాలేదని చెప్పింది. తనలాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడని, శరీరాన్ని తడుముతూ ఉండేవాడని తెలిపింది. ఆ సమయంలో తమ వయస్సు 6 ఏళ్లు మాత్రమేనని, దీంతో అతడి చేష్టలను తాము ఆపలేకపోయేవాళ్లమని చెప్పింది.