చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువే. ఓ హీరోయిన్ నటిస్తున్న సినిమాలు వరుసగా హిట్టవుతుంటే.. గోల్డెన్ లెగ్ అనేస్తారు. ఆమెని అందలాలు ఎక్కించేస్తారు. అడిగినంత పారితోషికం ఇచ్చుకుంటూ వెళ్తారు. అదే వరుసగా ఫ్లాపులు వస్తుంటే… ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. ప్రస్తుతం ఐరెన్ లెగ్ అనే పిలుపుకి అతి దగ్గరలో ఉంది పూజా హెగ్డే..పూజా హెగ్డే ఎంట్రీనే ఫ్లాపుల మయం. బాలీవుడ్ లో చేసిన మొహంజదారో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళ చిత్రం `మూగమూడి` కూడా డిజాస్టరే. తెలుగులో చేసిన తొలి సినిమా `ముకుంద` యావరేజ్కి దగ్గర్లో ఆగిపోయింది. `డీజే` వరకూ పూజాకి హిట్టు పడలేదు. దాంతో ఆమెపై ఐరెన్లెగ్ అనే ముద్ర పడింది. అయితే `డీజే`తో మెల్లమెల్లగా కోలుకుంది.
ఆ తరవాత అన్నీ విజయాలే. దాంతో..గోల్డెన్ లెగ్ అయిపోయింది. `పూజా ఉంటే సినిమా హిట్టే` అనిపించేంత క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. రెండే రెండు సినిమాలతో ఆ క్రేజ్ పోయింది. మార్చిలో విడుదలైన `రాధేశ్యామ్` అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. మొన్నటికి మొన్న విడుదలైన `బీస్ట్`దీ అదే దారి. ఈ రెండు సినిమాల్లోనూ తనే హీరోయిన్. పైగా సోలో హీరోయిన్. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా విరివిగా పాల్గొంది. అయినా సరైన ఫలితాలు రాలేదు. దాంతో.. రెండే రెండు సినిమాలతో గోల్డెన్ లెగ్ కాస్త, ఐరన్ లెగ్ అయిపోయింది. అయితే.. ఇప్పుడు పూజాకి అవకాశాలేం కొదవ లేదు. కాకపోతే… ఓ హిట్టు కొట్టి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.