మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ ఘటనపై అనేక మంది హీరోయిన్లు, ప్రముఖలు తమ గొంతు ఎత్తి బాధిత హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ ఒకరు. ఘటన తర్వాత మహిళా సంఘాలతో కలిసి పార్వతి ఒక పోరాటం చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
అయితే ఆ పోరాటం వల్ల తాను ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పార్వతి. తాను ఇదివరకు నటించిన సినిమాలు హిట్ అయినా తనకు సినిమా అవకాశాలు తగ్గాయని పేర్కొంది. నిజాన్ని మాట్లాడినందుకు తనను, పోరాటంలో ఉన్నవారిని ఎలా బెదిరించారో కూడా తెలిపింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్త చూసిన చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి పని కోల్పోయింది.
అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది.’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 ఫిబ్రవరిలో 17న జరిగిన నటి కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించింది కేరళ హైకోర్టు.