నటరత్న యెన్.టి.ఆర్., కత్తివీరుడు కాంత రావు కలసి 60 చిత్రాలలో నటించారు. పౌరాణిక చిత్రాలలో యెన్.టి.ఆర్. కృష్ణుడు, రాముడు పాత్రలకు ఎంత ప్రసిద్ధో, కాంత రావు నారదుడి పాత్రకు అంత ప్రసిద్ధి. ” దీపావళి” చిత్రంలో యెన్.టి.ఆర్. కృష్ణుడిగా నటించగా కాంత రావు మొట్ట మొదటి సారిగా నారదుడి పాత్ర పోషించారు. ఆ చిత్రంలో నారదుడిగా కాంత రావు అభినయం నచ్చిన యెన్.టి.ఆర్. బ్రదర్ ఇక మీదట నారద పాత్ర మీదే అని అభయం ఇచ్చారు, అప్పటి నుంచి కాంత రావు నారదుడి పాత్ర కు కేర్ అఫ్ అడ్రస్ అయిపోయారు.
అంతే కాదు మేము ముగ్గురు అన్నదమ్ములం మా చిన్న తమ్ముడు కాంత రావు అంటూ యెన్,టి.ఆర్. కాంత రావు గారిని ఎంతో ప్రోత్సహించేవారు. అటువంటి సందర్భం లో శ్రీ కృష్ణవతారం అనే చిత్రంలో నారదుడి పాత్రకు తీసుకున్నారు కాంత రావు గారిని, ఆ చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు. షూటింగ్ రోజు కార్ పంపిస్తే తనకు వంట్లో బాగాలేదని మళ్ళి వస్తానని కార్ తిప్పి పంపించేశారు కాంత రావు ,మళ్ళి మధ్యాహ్నం కార్ పంపగా ఆయన “రహస్యం ” అనే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు అని తెలిసింది,
ఆ విషయం కాస్త పుండరీకాక్షయ్య గారు యెన్,టి.ఆర్ చెవిన వేశారు. కాంత రావు ఆ విధంగా చేసినందుకు నొచ్చుకున్న యెన్.టి.ఆర్. కోపం తో నారదుడి పాత్రకు శోభన్ బాబు గారిని బుక్ చేసి చిత్రం పూర్తి చేసారు. శోభన్ బాబు గారు సంశయిస్తూనే నారదుడి పాత్ర చేసారు కానీ, శోభన్ బాబు గారికి నారదుడిగా మంచి పేరు వచ్చింది. ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందో తరువాత యెన్.టి.ఆర్. కి వివరించి క్షమాపణలు కోరారట కాంత రావు గారు. ఆ తరువాత కూడా యెన్.టి.ఆర్. చిత్రాలలో కాంత రావు గారే నారదుడిగా కొనసాగారు. యెన్.టి.ఆర్. గారి కోపం తాటాకు మంటలాంటిది, కక్ష సాధింపు ధోరణి అసలు ఉండేది కాదు అనటానికి ఇదొక నిదర్శనం.