సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారు. తన శరీర రంగు గురించి ఆమె మాట్లాడుతూ .. నల్లగా ఉన్నావు… సినిమాలలో ఎలా రాణిస్తావు? అనే ప్రశ్న తనను చాలా మంది అడిగేవారని.. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఈ ప్రశ్న ఎక్కువగా వచ్చేదని ఆమె అన్నారు.
అయితే మేకప్ మెన్లు తనకు కాస్త రంగు వేసి చాలా అందంగా చూపించారని ఆమె చెప్పారు. మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను అందంగా కనిపించానని చెప్పారు. తమిళ సినీ పరిశ్రమ తనకు పుట్టినిల్లు వంటిదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దివంగత జయలలిత విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రోజా. పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే అమ్మ(జయలలిత)ను తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని తెలిపారు.