బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్, ఆ తర్వాత ఎన్నో అంచనాలతో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల థియేటర్లలో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలానికి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యింది. 18వ తేదీ ఆదివారం నాడు జీ తెలుగు ఛానెల్ లో ‘సాహో’ సినిమాను ప్రసారం చేశారు. కాస్తంత భారీగానే ఈ సినిమాకు పబ్లిసిటీ చేసారు. కానీ టీవి ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా 5.82 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత టీవీల్లో అతిపెద్ద ఫ్లాప్ అంటున్నారు.
ఇక ఈ ప్లాఫ్ కు కారణాలు రకరకాలుగా చెప్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేయటం ప్రధాన కారణం అంటున్నారు. అలాగే రాంగ్ టైమ్ టెలీకాస్ట్. ఐపీఎల్ మాత్రమే కాకుండా.. సినిమా రిలీజ్ టైమ్ కు.. టీవీలో టెలికాస్ట్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే ఈ మూవీకి రేటింగ్ రాలేదని భావిస్తున్నారు. ఎన్ని అనుకున్నా ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న స్టార్ ఇమేజ్ కి అదిరిపోయే టీఆర్పీ రావాలి. అయితే ‘సాహో’ విషయంలో సీన్ రివర్సైంది. థియేటర్లో, టీవీల్లో రెండు చోట్లా రిజెక్ట్ చేశారు. అయితే తెలుగులో నిరాశ పరిచిన సాహో, బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దక్షిణాదిన ఫ్లాప్ టాక్ వస్తే, ఉత్తరాదిన మాత్రం హిట్ టాక్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.