నాన్న చేసిన సినిమాలను చూస్తూ పెరిగా. ఆయన ప్రభావం నాపై ఉందని కచ్చితంగా చెప్పగలను. ఆయనలాగే త్వరలోనే దర్శకత్వం వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నా’ అని అంటోంది యువ కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. భిన్న సినిమాల రూపకల్పనకు కేరాఫ్‌గా నిలిచిన ప్రియదర్శన్ తనయ కళ్యాణి ప్రియదర్శన్. ‘హలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయమై, ఆ తర్వాత ‘రణరంగం’, ‘చిత్రలహరి’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ కళ్యాణి నటించింది.
ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ మీనన్, సుధా కొంగర, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, సుహాసిని మణిరత్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఆంథాలజీ ‘పుత్తమ్ పుదు కాలై’. ఇందులో ‘ఇలమై ఇదో ఇదో’ అనే కథకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలో కాళిదాస్ జయరామ్, ఊర్వశి, కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. దీని గురించి కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ,’ ‘ఇలమై ఇదో ఇదో’ చిత్రీకరణ మూడు రోజుల పాటు జరిగింది. సెట్‌లో ఐదుగురు మాత్రమే ఉండేవాళ్ళం. నా మేకప్ ను నేనే వేసుకున్నాను. ఈ అనుభవం వింతగా అనిపించింది. మా నాన్న మాదిరిగానే నేను కూడా సినిమాలకు దర్శకత్వం వహించాలనే ధృడ నిర్ణయంతో ఉన్నాను’ అని చెప్పారు.