విధి చాల కఠినమయినది, దానికి జాలి, దయ ఉండవు. కానీ కొంత మందిని మాత్రం అది ఎందుకు అంత వికృతం గ కాటు వేస్తుందో అర్ధం కాదు. యెన్.టి.ఆర్. గారు “నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా రాజకుమారి” అంటూ ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆమె ఎవరో గుర్తుకు వచ్చారా? పాతాళ భైరవి చిత్రంలోని హీరోయిన్, మాలతీ గారు. సినిమా హిట్ అయితే అవకాశాలు వెల్లువెత్తుతాయి, అనుకుంటారు అందరు కానీ ఆమె విషయం లో విధి చిన్న చూపు చూసింది, ఆ సినిమా తరువాత ఆమెకు అక్క, వదిన, అమ్మ పాత్రలు ఆఫర్స్ వచ్చాయి,హీరోయిన్ పాత్రల కోసం కొంత కాలం ఎదురుచూసిన ఆవిడ, జరుగుబాటు కోసం ఆ పాత్రలతో తృప్తి చెందవలసి వచ్చింది. కొంతకాలానికి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలిపోయింది..
తాను కూడా ప్రవాహం తో కొట్టుకొని వెళ్లే గడ్డిపోచ లాగా హైదరాబాద్ చేరారు, తన ఆర్ధిక పరిస్థితుల రీత్యా ఒక చిన్న పూరి గుడిసెలాంటి ఇంట్లో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూసారు. అప్పట్లో వచ్చిన ఒక గాలి వానకు ఆమె ఉంటున్న ఇల్లు కూలిపోయి ఆమె మరణించటం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆమెతో కలసి నటించిన తోట రాముడు. తన రాజకుమారి మరణ వార్త తోట రాముడికి చేరిందో లేదో తెలియదు. పరిశ్రమ తరలి వచ్చి ఆమెకు నివాళులు అర్పించలేదు, మీడియా బ్రేకింగ్ న్యూస్ లు వేయలేదు, ఒక అనాధ శవం లాగా నలుగురు చందాలు వేసుకొని ఆమెను చివరి మజిలీ చేర్చారు.” తలపోసినవి ఏవి నేర వేరక అలసి పోయి, తలవంచుకొని వెళ్లి పోయావా రాజకుమారి, సెలవంటూ ఈ లోకాన్ని వదలి”.