కోట్లాధిపతి శోభన్ బాబు గారు తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన మొదటి పాప పుట్టినరోజుకు గౌను కొనడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా..ఆరోజు శనివారం. రాజ్యం పిక్చర్స్ అధినేత, నర్తనశాల నిర్మాత శ్రీధర్ రావు గారి ఇల్లు, ఆఫీస్ ఒకటే. అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్ రావు అక్కడ లేరు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మీరాజ్యం గారితో కలిసి ఆయన అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లారని, ఏడు గంటలకు వస్తారని ఆఫీస్ బాయ్ చెప్పాడు. కానీ అప్పటికి టైం ఇంకా నాలుగే… ఇంకా మూడు గంటలు ఎదురుచూడాలి. ఉందామా ? వెళదామా ? అనుకుంటుండగా… కూతురుకు మొదటి పుట్టినరోజు నాడు ఒక్క గౌను కూడా కొనలేకపోతున్నాననే అనే బాధ మనసులో నిండిపోయింది శోభన్ బాబుకు. అందుకే పాపకోసం మూడు గంటలే కాదు… మూడు జన్మలైనా ఎదురు చూడాలని నిర్ణయించుకుని అక్కడే పడిగాపులు పడ్డారు శోభన్ బాబు. టైం ఏడు… శ్రీధర్ రావు గారు ఇంకా రాలేదు… టైం ఎనిమిది… ఆయన వచ్చారు..
ఆయనను కలిసి విషయం చెప్పారు శోభన్ బాబు. “మేనేజర్ఇం టికెళ్లిపోయాడయ్యా… రేపు ఆదివారం… ఎల్లుండి సోమవారం వచ్చి కలువు. డబ్బులు ఇస్తాను అన్నారాయన. “రేపే పుట్టినరోజండీ…” అన్నారు శోభన్ బాబు. శ్రీధర్ రావు గారు రెండొందల రూపాయలకు చెక్కు రాసిచ్చారు. చెక్కు ఉంటే ఏంటి లాభం… డబ్బులు కదా కావాలి… అయినా సరే శోభన్ బాబు ఆ చెక్కును తీసుకుని నేరుగా మిత్రుడు కొమ్మినేని శేషగిరిరావు దగ్గరకు వెళ్లారు. మిత్రునితో విషయం చెప్పి “ఈ చెక్కు తీసుకుని రెండు వందలు ఇవ్వు… ఎల్లుండి చెక్కు మార్చి నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను” అన్నారు శోభన్ బాబు. కొమ్మినేని సరేనని డబ్బు ఇచ్చారు. అలా శోభన్ బాబు తన బంగారు పాప కోసం చిన్న గౌను కొన్నారు. ఇలా రెండొందల కోసం అప్పట్లో శోభన్ బాబు ఇంత కష్టపడ్డారన్నమాట.