
విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ తో భయానక పరిస్థితి నెలకొంది . ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి లీక్ అయిన విషవాయువు కారణంగా వేల మంది అస్వస్థతకు గురయ్యారు. పలువురు చనిపోయారు. అనేకమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ విషాదంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’నని చిరు ట్విట్ చేశారు.మహేష్ బాబు స్పందిస్తూ ‘వైజాగ్ వార్త నా మనసుని కలచివేసింది. ఇలాంటి పరిస్థితులలో గ్యాస్ లీక్ కావడం, దాని వలన ప్రాణాలు కోల్పోవడం బాధని కలిగిస్తుంది. బాధితులు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్ధిస్తున్నాను’ అని ట్వీట్‌లో తెలిపారు. వీరితో పాటు అల్లు అర్జున్ , రవితేజ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ ,రాజమోళి , వెంకటేష్ , కొరటాల శివ ,కళ్యాణ్ రామ్ , నాని , వరుణ్ తేజ్ , నాగచైతన్య , నారా రోహిత్ , అఖిల్ , నితిన్ , గుణశేఖర్ , నిధిఅగార్వల్, నాగశౌర్య విశాఖ ఘటన పై విచారం వ్యక్తం చేసారు.

