ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్ గారి జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ మహా రాజా రవి తేజ ‘క్రాక్’ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం. గత జనరల్ ఎలక్షన్స్ లో జరిగిన వివాదాస్పద అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇందులో మాస్ రాజా పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ పోలీస్ అధికారి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇన్సిపిరేషన్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.
గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. ఆయన తన సీఐ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజీనామాను ఉన్నత అధికారులు ఆమోదం తెలపకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్రకారం ఆయన చివరి నిమిషంలో హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాజాగా జరిగిన ఎన్నికలలో అక్కడి నుండి ఆయన ఘనవిజయాన్ని సాధించారు. ఈ విషయాలను ‘క్రాక్’ సినిమాలో చూపించనున్నారు. ఎందుకు ఆయన్ని అడ్డుకోవాలని చూశారు ..ఎందుకు ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్న విషయాలను సినిమాటిక్ గా ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇది బయోపిక్ కాదు, ఆయన పేరు కూడా ఎక్కడా వాడరని కేవలం పాత్రని మాత్రమే అలా చూపిస్తారని అంటున్నారు. సినిమా అంతా గోరంట్ల మాధవ్ గురించి కాదు కానీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని లోటుపాట్లని చూపించబోతున్నట్లుగా సమాచారం.