శివ శంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. ఓ ప్రతిభావంతుడైన కళాకారుడు లేడన్న విషాదం చిత్రసీమ అంతా అలుముకుంది. దాదాపు 800 చిత్రాలకు పనిచేశారు శివ శంకర్ మాస్టర్. క్లాసికల్ డాన్స్ మూమెంట్స్‌లో ఆయన స్పెషలిస్టు. ఆ పాటలే ఆయనకు పేరు తీసుకొచ్చాయి. అయితే శివ శంకర్ మాస్టర్ జీవితంలో ఓ విషాదకరమైన ఘటన జరిగింది. అదీ.. తనకు రెండేళ్ల వయసులో. చిన్నప్పుడు పెద్దమ్మ ఒడిలో ఆటలాడుకుంటున్నప్పుడు.. తాడు తెంపుకున్న ఓ ఆవు.. వాళ్ల వైపు దూసుకెళ్లిందట. ఆ ఆవు తమపై ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడిన శివశంకర్ పెద్దమ్మ… చేతిలో పిల్లాడితో సహా పరుగులు పెట్టిందట.
ఆ క్రమంలో ఆమె జారిపడింది. దాంతో శివ శంకర్‌కి సైతం దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో శివ శంకర్ వెన్నెముక విరిగింది. ఆతరవాత దాదాపు ఎనిమిదేళ్లు శివ శంకర్ మంచంమీదే ఉన్నారు. ఇక శివ శంకర్ లేని నడవలేడు అనుకున్నారంతా. అలాంటిది… గాయం నయమై, ఆ తరవాత ఏకంగా డాన్స్ మాస్టర్‌గా మారిపోయారు. సలీమ్ దగ్గర శిష్యరికం చేసిన శివ శంకర్ మాస్టర్… ఆయనకు ప్రియతమ శిష్యుడిగా మారిపోయారు. ఖైదీలోని రగులుతోంది మొగలి పొద పాట శివ శంకర్ మాస్టర్‌కెంతో పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి చూసుకునే అవసరం లేకుండా పోయింది.