కెరాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది. నీలాంబరిగా మీనా, మోహనగా రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, బ్రహ్మానందం, క్యాస్ట్యూమ్ కృష్ణ, నగేశ్, సోమయాజులు, ప్రసాద్ బాబు, రామిరెడ్డి నటించారు.
ఈ చిత్రానికి ఎమ్,.ఎమ్.కీరవాణి సంగీతం సమకూర్చగా, “అబ్బా నను గన్న అమ్మబాబు…” పాటను భువనచంద్ర రాశారు. “నీలిమబ్బు నురగలో…” అంటూ సాగే పాటను కీరవాణి అందించారు. ఇక ఇందులోని “భమ్ చిక భమ్ చేయి బాగా… వంటికి మంచిదేగా యోగా…”, “నా పాట పంచామృతం…”, “రేపల్లె మళ్ళీ మురళి విన్నది…”, “ముద్దిమ్మంది ఓ చామంతి…” పాటలను సీతారామశాస్త్రి పలికించారు. ఈ చిత్రం మ్యూజికల్ గానూ మంచి విజయం సాధించింది. మొదటి వారంలో కన్నా తరువాతి వారాలలో మిన్నగా జనాన్ని ఆకట్టుకుంది.
పోటీ చిత్రాలకన్నా తనదే పైచేయి అని చాటుకుంది. ఘనవిజయం సాధించింది. ‘అల్లరి మొగుడు’ చిత్రం మోహన్ బాబుకు స్టార్ గా మరింత పేరు సంపాదించి పెట్టింది. ఇందులోని హాస్యం జనానికి కితకితలు పెట్టింది. ఈ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్ హీరోగా ‘వీరా’ పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో రవిచంద్రన్ తో ‘గడిబిడి గండ’గా తెరకెక్కించారు. హిందీలో గోవిందతో ‘సాజన్ చలే ససురాల్’గా గా రూపొందించారు. అన్ని చోట్ల గిలిగింతలు పెట్టింది..