పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన “శంకరాభరణం” సంగీతపరంగా ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలుసు, అంత గొప్ప సంగీతాన్ని అందించిన కె.వి.మహదేవన్ గారు ఆ తరువాత పూర్ణోదయ చిత్రాలకు పని చేయలేదు, ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు, దాని వెనుక ఒక సున్నితమయిన కారణం ఉంది. శంకరాభరణం చిత్రానికి సంగీతం అందించిన మహదేవన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది, కానీ నిర్మాతల నుంచి దానికి తగిన గౌరవం లోపించింది. శంకరాభరణం విజయం తరువాత సినిమా విజయ యాత్రకు బయలుదేరిన సినిమా టీం కు జరిగిన ట్రైన్ రిజర్వేషన్ విషయంలో జరిగిన ఒక సంఘటన మహదేవన్ గారిని పూర్ణోదయకు దూరం చేసింది.మహదేవన్ గారి వద్ద పుహళేంది అనే సహచరుడు ఉండేవారు, తెర మీద ఆయన పేరును సహాయకుడు అనే వేసే వారు కానీ, అయన మహదేవన్ గారికి బహిప్రాణం వంటివారు. విజయ యాత్రకు బయలుదేరిన, ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కి ఫస్ట్ క్లాస్ లోను, సహాయకులకు సెకండ్ క్లాస్ లోను టికెట్ లు బుక్ చేసారు ప్రొడక్షన్ వారు.
ఈ విషయం గమనించిన మహదేవన్ గారు, ఏడిద నాగేశ్వర రావు గారిని అడిగారట ఎందుకు ఆలా టికెట్స్ చేసారు అని, దానికి నాగేశ్వర రావు గారు అది మా ప్రొడక్షన్ పాలసీ ఆండీ, టెక్నిషియన్స్ కి ఫస్ట్ క్లాస్, అసిస్టెంట్లకు సెకండ్ క్లాస్ అని చెప్పారట. అది వినిన మహదేవన్ గారి మనసు నొచ్చుకుంది, పుహళేంది నా అసిస్టెంట్ అని ఎవరు చెప్పారు అని అడిగారట, అయన మీ అసిస్టెంట్ అనే కదా అంటారు అందుకే ఈ టైపు రిజర్వేషన్ అని సమాధానం వచ్చే సరికి, ఆగ్రహించిన మహదేవన్ గారు ఆ విజయ యాత్రకు డుమ్మా కొట్టేసారు, అంతే కాదు ఇక మీదట మీ చిత్రాలకు పని చేయను అని ఖరాఖండిగా చెప్పేశారట. పుహళేంది పేరుకి అసిస్టెంట్ కానీ మహదేవన్ గారు తన తోడబుట్టిన వాడిగా ఆయనను చూసుకోవటమే కాదు ముద్దుగా “అప్పు” అని పిలుచుకునే వారు, ఈ విషయాలన్నీ తెలిసి కూడా, ఏడిద నాగేశ్వర రావు గారు అలా చేయటం మహదేవన్ గారి మనసును గాయ పరిచింది, ఆయన తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ తరువాత పూర్ణోదయ చిత్రాలకు సంగీతం అందించలేదు. కళాకారుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో, ఆగ్రహం కూడా అంతే కఠినంగా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ ఈ సంఘటన..!!