బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే అతనిది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ దీనిపైన విచారణ చేపడుతుంది. ఈ కేసులో అనుమానాలు ఉన్న ప్రతి ఒక్కరిని సీబీఐ ప్రశ్నిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య పట్ల టాలీవుడ్ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించారు.
బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేసారు” అంటూ ఘాటుగానే స్పందించారు రాములమ్మ విజయ్ శాంతి.