ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..తెలుగు, కన్నడ, తమిళ,మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500లకు పైగా చిత్రాల్లో నటించారు.
నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్, రాజ్‌కుమార్ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ‘జగదేక వీరునికథ’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’, ‘కులగౌరవం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటిగా ప్రెసిడెంట్ మెడల్, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. సినీ పరిశ్రమకు జయంతి చేస్తున్న సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ‘అభినయ శారద’ అనే బిరుదుతో ఆమెను సత్కరించింది.