వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ .. ‘ గద్దలకొండ గణేశ్’తో రెండు భారీ హిట్లతో ఉన్నాడు. ‘ గని’ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమోనని అంతా అనుకున్నారు. వరుణ్ తేజ్ కూడా అలాగే జరుగుతుందని ఆశించాడు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ ను షేర్ చేయడం జరిగింది. “ఇంత కాలంగా మీ ప్రేమను .. ఎఫెక్షన్ ను నాపై చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.
‘గని’ మేకింగ్ లో పాలుపంచుకున్న వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాము. కానీ ఎక్కడో మా ఐడియా మేము అనుకున్నట్టుగా రీచ్ కాలేదు. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే అనుకుంటాను. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను .. కొన్ని సార్లు నేర్చుకుంటాను .. కానీ కష్టపడం మాత్రం ఎప్పటికీ ఆపను” అని రాసుకొచ్చాడు. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాతో, కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. సయీ మంజ్రేకర్ కి ఇదే తొలి సినిమా. ఈ సినిమాపై వరుణ్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అవి ఫలించకపోవడం వలన, ఆయన ఇలా తన ఎమోషన్స్ ను షేర్ చేసుకున్నాడు.