దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘రిజానా- ఏ కేజ్డ్ బర్డ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరలక్ష్మి అంతర్జాతీయ ప్రేక్షకులను పలకరించనున్నారు..
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో వరలక్ష్మి హాలీవుడ్ లెజెండరీ నటుడు జెరెమీ ఐరన్స్‌తో కలిసి నటించనుండటం విశేషం. జెరెమీ ఐరన్స్ తన అద్భుతమైన నటనకు గాను పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈ సినిమాలో విధుషికా రెడ్డి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీలంకకు చెందిన ప్రముఖ దర్శకుడు చంద్రన్ రత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం..!!