యాంకర్ ఉదయభాను తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు దేవుడిచ్చిన చెల్లి మరణించిందని కన్నీరు పెట్టుకుంది. 24 ఏళ్లకే తన చెల్లి రజితమ్మ లేదని తెలిసి తట్టుకోలేకపోయింది. తన చిట్టి చెల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ప్లోరైడ్ బూతానికి బలైన ఆమె అవస్థలను గుర్తు చేసుకుంటూ బాధపడింది.
2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతంపై ప్రత్యేక కథనాలు చేసింది ఆమె. అప్పట్లో మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి రజితమ్మ అనే ఫ్లోరైడ్ బాధితురాలి పరిస్థితి చూసి చలించిపోయింది. అప్పటి నుంచి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ప్రతి పండగకు ఇద్దరు ఫోన్ ద్వారా పలకరించుకునే వారు. అలాంటి ఆ యువతి అతి చిన్న వయసులోనే మరణించడం ఆమెను కలిచి వేసింది. దీనిపై తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘంగా తన భావాలను పంచుకుంంది.
‘రజితమ్మ నాకు దేవుడిచ్చిన బంగారు చెల్లెల్లలో ఒకరు. ఆమె ఇక లేదు.నా చిట్టి చెల్లి రజితమ్మ.. నిశ్శబ్దంగా సడి చప్పుడు లేకుండా తన ప్రశ్నలకి జవాబు దొరకకముందే వెళ్లిపోయింది. గాలి నీరు నింగిని కలుషితం చేసిన కరుణ లేని కర్కశుల వల్ల ఆమె చనిపోయింది. నా చిట్టి చెల్లి రజితమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ రజిత వాళ్ళ అక్క ఉదయ భాను’ అంటూ హృదయ విదారకమైన పోస్టును ఉదయ భాను పోస్టు చేసింది. కాగా రజితమ్మ చిన్నతనంలోనే ఫ్లోరైడ్ బారిన పడింది. ఆమె కాళ్లు వంగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమెకు ఉదయభాను సాయం చేసి ఓ చిన్న కిరాణం దుకాణం పెట్టించింది.