దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి త్రిష, వయసు నాలుగు పదులు దాటినా ఇప్పటికీ అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, భవిష్యత్ ప్రణాళికలను ఆమె పంచుకున్నారు. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు తాను పెట్టుకున్న ఒక షరతు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ..
“అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొంటూ, కొన్ని ప్రకటనల్లో నటిస్తున్న సమయంలో నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా ఒప్పందంపై సంతకం చేసే ముందు మా అమ్మగారికి ఒక షరతు పెట్టాను. ఒకవేళ ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే, నన్ను ఏమీ అనకూడదని, నేను వెంటనే సినిమాలు వదిలేసి నా చదువు కొనసాగిస్తానని చెప్పాను. ఆ షరతుకు అమ్మ అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్‌పై సంతకం చేశాను” అని త్రిష వివరించారు. ఒకవేళ నటిగా విజయవంతం కాకపోయి ఉంటే, తాను సైకాలజిస్ట్ అయ్యేదాన్నని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు..!!