విషాదాంతమయిన ఆంధ్ర దేవానంద్ జీవితం. సినీ పరిశ్రమ లోని దుష్ట శక్తుల చీకటి కోరలకు బలి అయి అనామకంగా ఈ లోకాన్ని విడిచిన హీరో రామ్ మోహన్. బేగం పెట్ విమానాశ్రయం లో గ్రౌండ్ ఇంజినీర్ గ పని చేస్తున్న రామ్ మోహన్ మంచి అందగాడు, అతనిని సినిమా పురుగు కరిచింది ఎలాగయినా హీరో కావాలి అనుకున్నాడు. ఆదుర్తి సుబ్బా రావు గారు అంత కొత్తవాళ్ళ తో నిర్మించిన “తేనెమనసులు” చిత్రంలో హీరో గ నటించారు, అదే చిత్రంలో ఇంకొక హీరో గ సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. రామ్ మోహన్ మంచి అందగాడు కావటం తో మొదటి చిత్రం తోనే స్టార్ డం వచ్చింది, వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.
తేనెమనసులు చిత్రానికి ఆడిషన్స్ చేసిన కళాతపస్వి విశ్వనాధ్, చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బా రావు, రామ్ మోహన్ కి ఉజ్వలమయిన ఫ్యూచర్ ఉంటుంది అని ముందే ఊహించారు, వారి అంచనాలకు తగినట్లుగానే రామ్ మోహన్ తిరుగులేని హీరోగా ఎదిగారు. విజయం తలకి ఎక్కింది, చుట్టూ స్నేహితులు చేరారు, ఆల్కహాల్ అలవాటు చేసారు, నువ్వు పెద్ద హీరోవి టైం కి వెళితే నీ వేల్యూ ఏముంటుంది అని నూరిపోశారు. ఆల్కహాల్ మత్తులో మునిగితేలుతూ షూటింగుకు ఆలస్యంగా వెళ్ళటం, ఒక్కోసారి అసలు షూటింగుకి వెళ్లకుండా, నిర్మాతలను ఇబ్బందుల పాలు చేయటం మొదలు పెట్టారు, ఏ వృత్తిలో అయినా క్రమశిక్షణ లేకపోతే, ఎవరు నెత్తిన పెట్టుకోరు.
పరిశ్రమ రామ్ మోహన్ ని పక్కన పెట్టేసింది, అవకాశాలు తగ్గిపోయాయి, అలవాట్ల వలన కుటుంబం విచ్చిన్నం అయింది. అవకాశాలు లేక, భుక్తి గడవక, పొట్టకూటి కోసం మద్రాసు వదిలి హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో అద్దె సైకిల్ షాప్ నడిపే ఒక పాత స్నేహితుడి వద్దకు వచ్చి, అతని ఆశ్రయం పొంది అతనికి సహాయకుడిగా ఉంటూ, ఆ సైకిల్ షాపులోనే నివాసం ఉంటూ అక్కడే అనామకంగ మరణించారు ఆంధ్ర దేవానంద్.సినీ పరిశ్రమను శాసిస్తాడు అనుకున్న రామ్ మోహన్ చివరకు ఒక సైకిల్ షాప్ లో దిక్కులేని వాడిగా తుది శ్వాస విడిచారు. ఇది సినీ పరిశ్రమ తప్పు కాదు స్వయంకృత అపరాధం, విధి లిఖితం.