జొన్నలగడ్డ వెంకట సుబ్రమణ్య సోమయాజులు అంటే చాలా మందికి తెలియక పోవచ్చు, శంకరాభరణం, శంకర శాస్ట్రీ అంటే తెలియనివారుండరు. అటువంటి శంకరాభరణం సోమయాజులు గారు అప్పటి ముఖ్య మంత్రి ని మెప్పించి ఒక స్పెషల్ జి.ఓ. రిలీజ్ చేయటానికి కారణం అయ్యారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గ పని చేస్తున్న సోమయాజులు గారు శంకరాభరణం చిత్రంలో నటించటం జరిగింది, ఆ సినిమా తో రాత్రికి రాత్రి ఆయన కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాయి, అది చూసి కన్ను కుట్టిన కొంత మంది సోమయాజులు గారు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ సినిమాలలో నటించి పారితోషికం తీసుకున్నారు అని పిటిషన్ పెట్టారు.
అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నా రెడ్డి గారు శంకరాభరణం సినిమా తెప్పించుకొని చూసారు, అందులో సోమయాజులు గారి నటనకు ముగ్ధులైన చెన్నా రెడ్డి గారు, ఇంతటి మహానటుడు రెవిన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన వాడు అయినందుకు గర్వించాలి, ఈయన మీద చర్యలు ఏమిటి నాన్సెన్స్ అని చెప్పి, అయన మీద వచ్చిన పిటిషన్ ను చించి చెత్త బుట్టలో వేశారు. అంతే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న నటులు ఎవరయినా నాటకాలలో, సినిమాలలో నటించవచ్చు, అంటూ ఒక స్పెషల్ జి.ఓ. పాస్ చేసారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక “సాంస్కృతిక శాఖను” ఏర్పాటు చేసి సోమయాజులు గారిని దానికి డైరెక్టర్ గ నియమంచి, గౌరవించారు.