మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు, తన డ్రైవర్ ని నిర్మాత చేస్తే, అతను రెండు దశాబ్దాలలో మోహన్ లాల్ తో ముప్ఫయ్ సినిమా లు తీసి మోహన్ లాల్ గారి ఇమేజ్ ని ఇనుమడింపచేసాడు. ఆంటోనీ సినిమా యూనిట్ లో డ్రైవర్ గ పని చేస్తున్న రోజుల్లో ఒక రోజు నిర్మాత హీరో మోహన్ లాల్ ను తీసుకొని రమ్మని ఆంటోని ని పంపించాడు, తన అదృష్టానికి మురిసిపోతూ వెళ్లి మోహన్ లాల్ ను తీసుకొని వచ్చాడు, తరువాత షూటింగ్ చివరి రోజు మోహన్ లాల్ గారిని ఇంటి దగ్గర వదలటానికి వెళ్లిన ఆంటోనీ ని, పేరు పెట్టి పిలిచి భోజనం చేసి వెళ్ళమని చెప్పారట మోహన్ లాల్. ఆ మాటకే కడుపు నిండిపోయిన ఆంటోనీ తినకుండానే వచేసాడు. కొంతకాలానికి తమ ఊరికి దగ్గరలోనే మోహన్ లాల్ గారి షూటింగ్ జరుగుతుంటే స్నేహితులతో అక్కడకు వెళ్లిన ఆంటోనీ, దూరంగా నిలుచుండిపోయాడట, అంతమంది లో ఆంటోనీ ని గుర్తుపట్టిన మోహన్ లాల్ దగ్గరకు పిలిచి,
నాకు పెర్సెనల్ డ్రైవర్ కావాలి వస్తావా అని అడగ్గానే యెగిరి గంతేసి చేరిపోయాడు ఆంటోనీ. కొంతకాలానికి అతనికి మేనేజర్ హోదా ని ఇచ్చారు మోహన్ లాల్, ఆ తరువాత 1999 లో ” నరసింహం” సినిమా కదా చర్చలు జరుగుతుండగా ఆంటోనీ ని ఈ సినిమా ప్రొడ్యూస్ చేయమని, తాను రెమ్యూనరేషన్ లేకుండా నటించారట. అష్ట కష్టాలు పడి ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయి, మలయాళ సినిమా రికార్డ్స్ ని తిరగ రాసింది. అప్పటి నుంచి మోహన్ లాల్ తో ముప్ఫయి సినిమా లు చేసి,” లూసిఫెర్ ” ” దృశ్యం ” ” దృశ్యం 2 ” వంటి సినిమా లు తీసి మలయాళ సినిమాని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లారు ఆంటోనీ. తాను ప్రార్ధించే యేసు ప్రభువే మోహన్ లాల్ రూపం లో వచ్చారు తనకోసం అని ఆంటోనీ అంటే, తాను పూజించి కృష్ణుడే ఆంటోనీ రూపం లో వచ్చాడు అని మోహన్ లాల్ గారు అనటం విశేషం. మత సామరస్యానికి నిలయమైన దైవభూమి లో జీసస్, కృష్ణుడు కలసి మలయాళ సినీ చరిత్రను తిరగరాస్తున్నారు. దానికి నిదర్శనమే ఆంటోనీ నిర్మిస్తున్న ” మరక్కార్ ” ( అరేబియా సముద్ర సింహం) సినిమా అని చెప్పుకోవచ్చు..