30 ఏళ్ల వయసున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తనకంటే తొమ్మిదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. వయసు అంతరం విషయంలో ఇబ్బంది పడటం..దీని వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. సంసార జీవితంలో చిన్నపాటి కల్లోలం రావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య నెమ్మదిగా గొడవ సద్దుమణిగి ఒక్కటవ్వడం.. ఈ నేపథ్యంలో నడుస్తుందీ సిరీస్. ఆహా ఓహో అనిపించే సిరీస్ కాదు కానీ.. ప్రతి ఎపిసోడ్ ఆహ్లాదంగా.. సరదాగా సాగిపోవడంతో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
ఒక్కో ఎపిసోడ్ రిలీజవుతుంటే ఈ సిరీస్‌కు ఆదరణ అంతకంతకూ పెరిగిపోయి యూట్యూబ్‌లో ఇదొక బ్లాక్ బస్టర్ అయిపోయింది. సీజన్-1 ముగిసినపుడు అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకున్నారు. అదే సమయంలో రెండో సీజన్ రాబోతోందని అప్ డేట్ ఇవ్వడంతో ప్రేక్షకులు సంతోషించారు. కొన్ని నెలలు టైం తీసుకుని ఇప్పుడు సీజన్-2ను రెడీ చేసేసింది ఛాయ్ బిస్కెట్ సంస్థ. ఒక చిన్న ప్రి టీజర్‌తో ఈ విషయాన్ని వెల్లడించింది…త్వరలోనే ఫుల్ టీజర్ వదలబోతున్నారు.
వచ్చే నెలలోనే రెండో సీజన్ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్‌లో పృథ్వీ, మేఘనలుగా లీడ్ రోల్స్ చేసిన చైతన్య రావు, అనన్యలకు ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఇద్దరికీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దర్శకుడు, రచయితలు కూడా మంచి పేరే సంపాదించారు.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం సీజన్-2 కోసం ఎదురు చూస్తున్నట్లు మెసేజ్ పెట్టడం విశేషం. మరి తొలి సీజన్ తర్వాత పెరిగిన అంచనాలను 30 వెడ్స్ 21 టీం ఏమేర అందుకుంటుందో చూడాలి.