
పూణె జిల్లా లోనావాలా సమీపంలో తన భూమిని సోనాలి కబ్జా చేశారంటూ స్థానిక రైతు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. ఈ వార్తలు మీడియాలో రావడంతో సోనాలి బృందం వెంటనే స్పందించి, ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇదంతా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నమేనని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. లోనావాలాలో సోనాలి బింద్రేకున్న ఆస్తి పక్కనే తన పొలం ఉందని, ఆమె తన భూమిలోకి చొరబడి కంచె వేసుకున్నారని రైతు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లగా తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు..
దీనిపై స్థానిక పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఆరోపణలపై సోనాలి బింద్రే తరఫు న్యాయవాదులు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ భూమిని తాము నిబంధనలకు అనుగుణంగా, చట్టబద్ధంగా కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. తాము ఎవరి భూమినీ ఆక్రమించలేదని, భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కేవలం సెలబ్రిటీ అయినందున, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సోనాలి ఆగ్రహం వ్యక్తం చేశారు..!!

