అక్కినేని వారసుడు నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్’ మూవీలో ఒక చిన్న పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ నటించాడు. ఆయనకూ ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ‘ఆరెంజ్’లో, నాని మూవీ ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాల్లోనూ సిద్ధూ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2011లో ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 2016లో వచ్చిన ‘గుంటూర్ టాకీస్’తో మంచి అటెన్షన్ సంపాదించాడు.
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’ సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటించాడు. కరోనా టైమ్ లో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ఆహాలో విడుదలైన ‘మా వింత గాధ వినుమా’ సినిమాలు మూవీ ఆయనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. ఈ రెండు సినిమాలకు రైటర్‌గా, ఎడిటర్‌గానూ సిద్ధూ పని చేయడం విశేషం. ఇక, ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇలా వరుసగా మూడు హిట్స్ తో సిద్ధు పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆయన డేట్స్ కోసం నిర్మాతల క్యూ కడుతున్నారు. ఈతరం యువతకు తగ్గట్లు ప్రేమ కథలను ఎంచుకోవడం, తెలంగాణ యాసతో ఆయన డైలాగులు పలికేతీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మున్ముందు ఇంకెన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సిద్ధూ తన స్థానాన్ని పదిలపర్చుకుంటాడో చూడాలి.