1969 లో బాపు గారి దర్శకత్వం లో అక్కినేని నాగేశ్వర రావు గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన చిత్రం ” బుద్ధిమంతుడు”. ఆ చిత్రం షూటింగ్ లో శోభన్ బాబు గారు కొంత ఇబ్బంది కి గురి అయ్యారు. ఈ చిత్రంలో శోభన్ బాబు గారు శ్రీ కృష్ణుడిగా, అక్కినేని గారు పూజారిగా నటించారు. పరమ భక్తుడు అయిన ఆ పూజారికి శ్రీ కృష్ణుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు, పూజారి తన కష్టం సుఖం చెప్పుకుంటూ ఉంటాడు. అక్కినేని గారు కృష్ణుడి పాదాలకు నమస్కారం చేస్తుంటారు, ఆ షాట్ తీసిన ప్రతి సారి, సీన్ అయిపోగానే శోభన్ బాబు గారు మేకప్ తీసిన వెంటనే అక్కినేని గారికి పాదాభివందనం చేసి, క్షమించండి అపచారం జరిగింది అని క్షమాపణ చెప్పేవారట.
షూటింగ్ కదా దానికి అంత ఫీల్ అవవలసిన అవసరం లేదు అని అక్కినేని గారు ఎంత వారించినా శోభన్ బాబు గారు వినేవారు కాదట. సీనియర్ నటుల మీద ఆ తరం నటులు అంత గౌరవం కలిగి ఉండేవారు. ఇప్పటి తరం వారికి, శోభన్ బాబు గారి చర్య చాదస్తం గ అనిపించవచ్చు, ఎంత నటన అయినా ఒక సీనియర్ నటుడు తన పాదాలను స్పృశించి నమస్కరించటం శోభన్ బాబు గారు ఒప్పుకోలేకపోవటం ఆయన సంస్కారానికి నిదర్శనం. అందుకే శోభన్ బాబు గారిని “బుద్ధిమంతుడు”అంటారు అందరు.