తెలుగునాట అత్యధిక `నంది` పురస్కారాలు అందుకున్న కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు విక్టరీ వెంకటేశ్. `కలియుగ పాండవులు` (1986), `స్వర్ణకమలం` (1988), `ప్రేమ` (1989), `ధర్మ చక్రం` (1996), `గణేశ్` (1998), `కలిసుందాం..రా!` (2000), `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` (2007) చిత్రాలకు గానూ ఏడుసార్లు `నంది` అవార్డులు సొంతం చేసుకున్నారు వెంకీ. ఉత్తమ నూతన నటుడు విభాగంలో `కలియుగ పాండవులు` కోసం స్పెషల్ జ్యూరీని అందుకున్న వెంకీ.. ఆపై `స్వర్ణకమలం` కోసం మరో స్పెషల్ జ్యూరీ కైవసం చేసుకున్నారు.
మిగిలిన ఐదు చిత్రాలకు `ఉత్తమ నటుడు` విభాగంలోనే ఆ పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వెంకీకి `నంది`ని అందించిన చిత్రాల్లో మూడు సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే సందడి చేశాయి. ఆ చిత్రాలే.. `ప్రేమ`, `ధర్మచక్రం`, `కలిసుందాం..రా!`. ఈ మూడు సినిమాలని కూడా వెంకీ హోమ్ బేనర్ సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థనే నిర్మించడం గమనార్హం. కాగా, సంక్రాంతి సీజన్ లో రిలీజైన సినిమాలతో మూడు సార్లు `నంది` అవార్డులు అందుకున్న ఏకైక హీరో వెంకటేశ్ నే కావడం విశేషం. మొత్తమ్మీద.. సంక్రాంతి సీజన్ లో సెన్సేషనల్ హిట్స్ తోనే కాదు, `నంది` పురస్కారాల పరంగానూ రికార్డులుండడం వెంకీ అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే.