1980 వ దశకం లో కళా తపస్వి విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సంగీత ప్రధానమయిన చిత్రం ” శంకరాభరణం”. ఆ చిత్రం ఎంత విజయవంతం అయిందో, అందులోని పాటలు ఆబాల గోపాలాన్ని ఎంతగా అలరించాయో మనందరికీ తెలుసు. అంతటి సంగీత ప్రధానమయిన చిత్రం లోని పాటలు బాలు గారు పాడటం చాల మందికి మింగుడు పడ లేదు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ వంటి వారు పాడ వలసిన పాటలు బాలు తో పాడించారు అని కొంత మంది విమర్శించారు కూడా. బాలు గారి చేత పాడించటానికి వెనుక ఒక వ్యక్తి ప్రమేయం ఉంది ఆయన ఎవరు అంటే, మహదేవన్ గారి అసిస్టెంట్, పుహళేంది గారు. మనం శాస్త్రీయ సంగీతం మీద డాక్యుమెంటరీ తీయటం లేదు, మన సినిమాలోని పాటలు సామాన్య ప్రేక్షకుడిని కూడా రంజింప చేయాలి అంటే బాలు పాడితెనె అది సాధ్యం. శాస్త్రీయ సంగీతానికి సినిమాటిక్ టచ్ రావాలి అంటే బాలు పాడాలి లేదంటే పాటలు ప్రేక్షక ఆదరణ పొందటం కష్టం,
అని గట్టిగ వాదించిన వారు పుహళేంది. బాలు ఆంజనేయుడు వంటి వాడు అతని శక్తీ అతనికి తెలియదు, మనం సపోర్ట్ చేస్తే తప్పకుండా బాగా పాడగలడు అని మహదేవన్ గారిని, విశ్వనాధ్ గారిని ఒప్పించారు. శంకరాభరణం పాటలు ఎంతగా ప్రేక్షక ఆదరణ పొందాయో మనందరం విన్నాము, చూసాము. ఆ పాటలకు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం పొందారు బాలు గారు. ఆ చిత్రం తరువాత ఒక సందర్భం లో బాలమురళి కృష్ణ గారు, ” నేను బాలు లాగా పాడలేను,కానీ బాలు నాలాగా పాడగలడు” అని కితాబు ఇవ్వటం గమమనార్హం.బాలు గారు బాలమురళి కృష్ణ గారిని పితృసమానులుగా గౌరవించే వారు.