శంకరాభరణం సినిమా తో విశ్వనాధ్ గారి, సినీ గమనమే మారిపోయింది. శంకరాభరణం సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా విశ్వనాధ్ గారి కీర్తి బావుటా ఎగిరింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అవార్డులు వరుస కట్టాయి. వీటన్నిటి కంటే విశ్వనాథ్ గారు పెద్ద అవార్డు గ భావించే ఎన్నో సంఘటనలు జరిగాయి. అటువంటి అనుభవాల్లో ఒకటి. శంకరాభరణం రిలీజ్ అయిన తరువాత విశ్వనాధ్ గారు విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. వారు బస చేసిన లాడ్జి నుంచి ఇంకొక చోటికి వెళ్లేందుకు ఒక టాక్సీ ఏర్పాటు చేసారు.
టాక్సీ డ్రైవర్ ముస్లిం, టాక్సీ ఎక్కిన విశ్వనాథ్ గారు, డ్రైవర్ తో మాటకలుపుతూ శంకరాభరణం చూసావా, అని అడిగారట, చూసాను సర్ అన్నాడట, ఎన్ని సార్లు చూసావు అని అడగగానే అయిదు సార్లు చూసాను అన్నాడట, ఏముందయ్యా ఆ సినిమాలో అని అడిగారట విశ్వనాధ్ గారు. ఏమో తెలియదు సర్ ఆ సినిమా హాలులో కూర్చుంటే, ఒక గుడిలో కూర్చున్న భావన కలుగుతుంది అన్నాడట, ఒక ముస్లిం అయి ఉండి, సినిమా చూస్తుంటే గుడిలో కూర్చున్న భావన కలిగింది అని చెప్పటం గొప్ప అవార్డు గ భావించారట విశ్వనాధ్ గారు..