ఆభరణాల కోసం కోట్లల్లో బడ్జెట్ పెట్టాలి. వందల మంది పాల్గొనే షూటింగ్‌లో ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ చాలా కష్టమైన విషయాలే అయినప్పటికీ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రాజీ పడట్లేదు. ఇంతకుముందు తనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన పౌరాణిక చిత్రం ‘రుద్రమదేవి’ కోసం గుణశేఖర్ నిజం బంగారంతోనే ఆభరణాలు చేయించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆయన తన సొంత సంస్థలోనే రూపొందించిన ‘శాకుంతలం’కి కూడా ఇదే ట్రెండును ఫాలో అయ్యాడట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.14 కోట్లు ఖర్చుపెట్టి ఆభరణాలు చేయించాడట గుణశేఖర్. “శాకుంతలంలో సమంత సహా ప్రధాన పాత్రధారుల కోసం రూ.14 కోట్ల విలువైన బంగారం, వజ్ర ఆభరణాలను వాడాం..
ఇందుకోసం 15 కిలోల బంగారం ఉపయోగించాం. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ గారు బంగారు కిరీటం సహా కొన్ని ఆభరణాలు వాడిన విషయం తెలిసి ఆ స్ఫూర్తితోనే నా సినిమాల్లో నిజమైన ఆభరణాలు వాడుతున్నా. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడు, మేనక పాత్రలకు ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా సారథ్యంలో ఆభరణాలు తయారు చేయించాం. వసుంధర జువెలర్స్ వాళ్లు 7 నెలలు శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. సమంత కోసమే 14 రకాల ఆభరణాలు తయారు చేయించాం. పూర్తిగా చేత్తో చేసిన ఆభరణాలు పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని, సహజత్వాన్ని తీసుకొచ్చాయి” అని గుణశేఖర్ తెలిపాడు..!!