మళయాల ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో సినీప్రముఖులే కాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో కేరళ సర్కార్ మళయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిగ్గుతేల్చాలని హేమ కమిటీని నియమించింది. ఇటీవల ఆ కమిటీ నివేదిక రాగా.. ఇండస్ట్రీలో మహిళా నటీమణులు నిజంగానే ఇతర కోస్టార్స్ నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారని తేలడంతో ఇతర సినీ ఇండస్ట్రీలకు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
అయితే, హేమ కమిటీ నివేదికపై సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ..‘కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాల కోసం ఎన్నో ఏళ్లుగా మహిళలు పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా అటువంటి విషయాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని సమంత కోరారు..!!