డైరెక్టర్ కృష్ణ వంశీ, సినీ గేయ రచయిత సిరివెన్నెల గారిది గురు శిష్యుల బంధం, ఒక రకంగా చెప్పాలంటే వారిది “ఆత్మబంధం”.అటువంటి సిరివెన్నెల గారు మరణించినపుడు కృష్ణ వంశీ చివరి చూపులకు రాలేదు. ఈ కృష్ణ వంశీ కి ఎమోషన్స్ లేవయ్యా అనుకున్నారు అందరు. అదే విషయాన్నీ ఎవరో ఆయనను అడిగేసారు కూడా, దానికి సమాధానంగా కృష్ణ వంశీ చెప్పినమాటలు వింటే కళ్ళు చెమర్చుతాయి. నాకు ఎమోషన్స్ లేవు అనుకుంటారు చాలామంది, అందుకే సిరివెన్నెల గారిని చూడటానికి రాలేదు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నాకు సిరివెన్నెల అంటే తెల్లటి చొక్కా, లుంగీ కట్టుకొని పగలబడి నవ్వుతూ ప్రపంచం లోని అనేక విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే వ్యక్తిగా గుర్తుంచుకోవటమే ఇష్టం, ఆలా నిర్జీవంగా ఉన్న గురువు గారిని ఊహించటానికి కూడా నా మనసు అంగీకరించలేదు, అందుకే రాలేదు అని చెప్పుకొచ్చారు.ఆ రోజు టి.వి. కూడా చూడకుండా ఆలా ఒంటరిగా అయన జ్ఞాపకాలలో ఉండిపోయాను అని చెపుతూ భావోద్వేగానికి లోనయ్యారు..
గురువు గారు మూడేళ్ళుగా ” వచ్చిన పని అయిపోయిందిరా అబ్బాయి, రాయాల్సింది రాసేసాం ఇక బయలుదేరటమే” అంటుండేవారు, అప్పుడు నాకు అర్ధం కాలేదు, కానీ అయన తన తన నిష్క్రమణను ముందే ప్రకటించేసారేమో అనిపిస్తుంది ఇప్పుడు. తన దర్శకత్వం లో వస్తున్న ” రంగమార్తాండ ” చిత్రం కోసం రాసిన ” ఏం పొందావయ్యా విజయం ,ఎవరితో చేశావయ్యా యుద్ధం, నీతో జరిగే పోరాటంలో నువ్వే ఓడిపోయావు. నీ నిలయమేది, నర్తనశాల కాదా? నీ కొలువు ఏది విరాటపర్వం కాదా? ముగిసిందా నీ అజ్ఞాతవాసం” అనే పాటను ఫోన్ లో వినిపించి, చాల మంచి పాట రాయించావురా అబ్బాయి, తరాలపాటు నిలిచిపోతుంది అంటూ, రేపు ఆపరేషన్ ఉంది మళ్ళీ కలుద్దాం అని చెప్పిన మాటలు, నాకు” ఇక సెలవురా అబ్బాయి” అని చెప్పినట్లుగా అనిపించాయి, “ఆత్మసంబంధం” అంటారు కదా అటువంటి సంభాషణ మా ఇద్దరి మధ్య జరిగినట్లనిపించింది అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు కృష్ణ వంశీ. సిరివెన్నెల గారి పాటలే కాదు మాటలు కూడా చాలా భావగర్భితంగా ఉండేవి, అంత గొప్ప రచయిత సాహిత్యాన్ని చవి చూచిన మనందరం చాల ధన్యులం. ” తెల్లారింది లెగండోయ్” అంటూ నిద్ర లేపారు,” కదలిరాద తనే వసంతం” అంటూ ధైర్యం చెప్పారు,” నిగ్గదీసి అడుగు” అంటూ నిలదీశారు, “ఎంతవరకు ఎందుకొరకు” అంటూ భుజం తట్టారు, ” జగమంత కుటుంబం నాది” అంటూ నిష్క్రమించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.