ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో చిత్రసీమ షాక్ కి గురైంది. ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. కానీ.. ఈ సినిమాని వాయిదా వేయడం.. చిత్రబృందానికి ఏమాత్రంఇష్టం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఇది. దీని వల్ల… ఆర్.ఆర్.ఆర్ నిర్మాతకు ప్రస్తుతానికి రూ.25 కోట్ల నష్టం. జనవరి 7న ఈ సినిమా విడుదల కావాల్సింది. నెల రోజుల నుంచీ.. ఆర్.ఆర్.ఆర్ బృందం భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తోంది. దాదాపు ఇండియా అంతా.. ప్రచారం జోరుగా చేసుకుంటూ వచ్చింది.
ముంబైలో ఓ భారీ ఈవెంట్ చేసింది. ఇప్పటి వరకూ ప్రమోషన్ల నిమిత్తం దాదాపుగా రూ.25 కోట్లు ఖర్చు చేశారని టాక్. అదంతా బూడిదలో పోసిన పన్నీరే. మరోవైపు… ఓవర్సీస్ లో టికెట్లని అమ్మేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ బృందం ముంబైలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ కి దాదాపు 9 కోట్లు ఖర్చయ్యింది. అయితే ఈ ఈవెంట్ ప్రసార హక్కుల్ని జీ టీవీ సొంతం చేసుకుంది. ఆ రూపంలో 9 కోట్లు తిరిగి వచ్చేసినట్టే. లేదంటే.. ప్రమోషన్ల పేరుతో మరో 9 కోట్లు నష్టపోవాల్సి వచ్చేది.