క్రీడా నేపథ్య చిత్రాల్లో చాలా ఎమోషన్ ఉంటుంది. అవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ‘లక్ష్య’ చిత్రం అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది కేతికా శర్మ. ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిందీ భామ. ఆమె నాగశౌర్య సరసన కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కేతికా శర్మ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు రితిక. పక్కింటి అమ్మాయి తరహాలో ఉంటుంది. తన మనసుకు నచ్చిన పని చేస్తుంది. నిజజీవితంలో నేనూ అలాగే ఉంటాను. నా మనసుకు నచ్చిందే చేస్తాను.
అందుకే నన్ను భరించడం కొంచెం కష్టమే. తొలి చిత్రం ‘రొమాంటిక్’తో పోల్చితే పూర్తి వైవిధ్యమైన పాత్ర ఇది. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. నాకు రాష్ట్రస్థాయి స్విమ్మర్‌గా గుర్తింపు ఉంది. ‘లక్ష్య’ సినిమా విలువిద్య నేపథ్యంలో భావోద్వేగభరితంగా సాగుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఆర్చర్స్‌ను కలిసి వాళ్ల అనుభవాల గురించి తెలుసుకున్నా. నాకు భాషా పరమైన ఎలాంటి హద్దులు లేవు. నా జీవితంలోని ఒకే ఒక కల..నటినవ్వాలని. అది నెరవేరింది. అభినయప్రధాన పాత్రలపై దృష్టి పెడుతూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటా’ అని చెప్పింది.