టాలీవుడ్ డైరెక్టర్‌లలో సుకుమార్‌ది ప్రత్యేకమైన శైలి. సినిమాను చూసే ప్రేక్షకుడి స్థాయిని పెంచేలా తెరకెక్కిస్తాడు. ప్రేక్షకుడి మెదడును తొలిచేలా.. ఆలోచనలకు పదనుపెట్టేలా లాజిక్‌లతో సినిమాను మలుస్తాడు. ఎన్ని లాజిక్‌లను పెట్టినా కూడా సినిమాలోని ఎమోషన్స్‌తో సాధారణ ప్రేక్షకుడిని సైతం కట్టిపడేస్తుంటాడు. అలాంటి సుకుమార్ ఒక్కోసారి ప్రేక్షకుడి స్థాయిని మించిన సినిమాలను తెరకెక్కిస్తాడు. అలాంటి క్రమంలోనే వన్ నేనొక్కడినే తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ బాగానే ఉన్నా కూడా జనాలకు అంతగా కనెక్ట్ అవ్వలేదు.
ఆ సినిమా తరువాత సుకుమార్ మరీ అంత లెవెల్‌తో తీయడం కరెక్ట్ కాదని భావించాడో ఏమో గానీ నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ సినిమాను మాస్ ఆడియెన్స్ మెచ్చేలా తీశాడు. ఆ తరువాత రంగస్థలం లాంటి మాస్ సినిమాను క్లాస్ అడియెన్స్ సైతం మెచ్చుకునేలా తీశాడు. రంగస్థలం అనేది టాలీవుడ్‌లో ఓ చరిత్ర. ప్రతీ సీన్, ప్రతీ పాత్రలు, ప్రతీ డైలాగ్ ఓ పుస్తకంగా రాయోచ్చు. అలాంటి రంగస్థలంలో జగపతి బాబును చంపే సీన్‌పై పెద్ద థియరీనే ఉంది. ఊరి ప్రెసిడెంట్ చిట్టిబాబుకు భయపడి ఎక్కడో దాక్కుంటాడు. అలా దాక్కున ప్రెసిడెంట్‌ను చిట్టిబాబు కనుక్కుని కర్రతో కొట్టి కొట్టి చంపుతాడు. అయితే ఆ సీన్ అలా ఎందుకు పెట్టాడో సుకుమార్ వివరించాడు.
ఆ సినిమాలో మొదటి నుంచి రామ్ చరణ్ ఓ పాము కోసం వెదుకుతుంటాడు. మొదటి సీన్‌లో పాము కోసం వెతుకుతూ.. దాని కూసాన్ని చూస్తాడు. అలా పాముకి చిట్టిబాబుకి ఉన్న బంధాన్ని చూపిస్తాడు. మనం పామును కర్రతో కొట్టి చంపుతాం. అలాగే చిట్టిబాబుకు ఆ ప్రెసిడెంట్ పాము లాంటి వాడు. అందుకే అలా ఆ ఎమోషన్స్‌లో కర్రతో కొట్టి కొట్టి చంపేలా సీన్‌ను చూపించాడట. మొత్తానికి సుకుమార్ లెక్కల మాష్టారు అని నిరూపించుకున్నాడు. ప్రతీ ఒక్క సీన్‌కు ఒక్కో ఫార్మూలా, థియరి ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు.