కరోనా మహమ్మారి ప్రజల జీవితాలలో అనేక మార్పులు తీసుకొచ్చింది. పరిశుభ్రతని తప్పక పాటిస్తూ తగు జాగ్రత్తలలో ఉండాలని నేర్పించింది. అయితే కరోనా వలన కొంత మంచి జరిగినా కూడా, వినోదం అనేది దొరకకుండా పోయింది. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి బయటకు పోవాలన్నా భయమే. రిలాక్సేషన్ కోసం థియేటర్స్‌లో సినిమా చూడాలన్నా భయమే. ఇలాంటి పరిస్థితులలో ఓటీటీ ద్వారా ఎక్కువ వినోదం అందించేందుకు సిద్దమయ్యారు నిర్వాకులు. ప్రేక్షకులు ఇప్పట్లో థియేటర్స్ ముఖం చూడరని భావించిన కొందరు నిర్మాతలు కొత్త ఓటీటీ సంస్థలతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే మాధ్యమంతో వినోదం అందించే ప్రయత్నం చేస్తుండగా, తాజాగా దగ్గుబాటి రానా యూట్యూబ్ ఛానెల్‌తో వినోదం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌత్ బే అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. ఒక్క తెలుగు భాషకి సంబంధించిన కంటెంటే కాకుండా అనేక భాషల కంటెంట్‌ని సౌత్ బే యూట్యూబ్ ఛానెల్లో చూడొచ్చని అంటున్నారు రానా. పది సెకన్లు నుండి పది గంటల వరకు నిడివి ఉన్న కథలు ఇందులో అందుబాటులో ఉంటాయట. అంతేకాదు మంచి టాలెంట్ ఉన్న వారికి కూడా దీని ద్వారా అవకాశాలు లభిస్తాయి. ఇందులో కథలతో పాటు న్యూస్, యానిమేషన్, ఫిక్షన్ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుందని పేర్కొన్నాడు రానా.