అక్షయ్ కుమార్ క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన శారీరకంగా ఫిట్‌గా ఉన్నారంటే అందుకు కారణం తెల్లవారుజామునే లేవడం. తనతో పనిచేసిన నటీనటులు కూడా వారి జీవనశైలిని మార్చుకునేంతలా అక్కీ ప్రభావితం చేస్తారు. అయితే ఆయన గురించి కథానాయకుడు రానా ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో ఓసారి తను ఓ రేడియో ఇంటర్వ్యూలో ఉదయమే పాల్గొనాల్సి ఉండగా.. అక్షయ్ తనను ఎలా తీసుకెళ్లారో గుర్తు చేసుకున్నారు. ముంబయికి వచ్చి అక్షయ్ కుమార్తో కలిసి పనిచేయండి. ఈ నగరంపై మీకున్న ఆలోచన మారిపోతుంది. నా జీవితంలో సగ భాగం నేను ఇక్కడే గడిపాను.
అతనితో కలిసి ‘బేబీ’, ‘హౌస్ఫుల్ 4’ చిత్రాల్లో నటించాను. ఒక రోజు ఉదయం 5:45 గంటలకు నేను రేడియో స్టేషన్ వెళ్లాల్సి ఉండగా.. తనే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్లాడు అని నటుడు రానా అన్నారు. ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన రానా.. దాని గురించి కూడా మాట్లాడారు. ‘స్టూడియోకు నా ఇంటి నుంచి ఐదు నిమిషాలు. నా ఇద్దరు స్నేహితులు మాత్రమే పెళ్లి కార్యక్రమాన్ని మొత్తం చూసుకున్నారు. 30 కంటే తక్కువ మందిని వివాహానికి ఆహ్వానించాం. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయించిన తర్వాతే లోపలికి అనుమతించాం’ అని తెలిపారు.