పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఉక్రెయిన్‌లో జరిగిన విషయం తెలిసిందే! అక్కడ షూటింగ్ జరిగిన సమయంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు రస్టీ అనే ఉక్రెయిన్ బాడీగార్డుగా వ్యవహరించాడు. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పుట్టినగడ్డను కాపాడుకోవడానికి అతడు సైనికుడిగా మారాడు. అతడే కాదు, 80 ఏళ్ల అతడి తండ్రి కూడా గన్ పట్టుకుని యుద్ధంలో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో కష్టాలతో సతమతమవుతున్న రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రామ్‌చరణ్. చెర్రీ పంపిన డబ్బులతో అతడు నిత్యావసర వస్తువులు, మెడిసిన్ కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ రస్టీ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అతడు మాట్లాడుతూ.. ‘నా పేరు రస్టీ, ఉక్రెయిన్ నా స్వస్థలం. కీవ్‌లో షూటింగ్ జరిగినప్పుడు రామ్‌చరణ్‌కు బాడీగార్డుగా పని చేశాను. రష్యా రాకెట్ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోతున్నారు. ఈ విషయం తెలిసి రామ్‌చరణ్ ఫోన్‌లో మాట్లాడారు. ఎలా ఉన్నారు? కుటుంబం క్షేమంగా ఉందా? అని అడిగారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. అలాగే డబ్బులు పంపించారు. దానితో నా భార్యకు మందులు తీసుకున్నాను. థ్యాంక్‌యూ రామ్‌చరణ్’ అని చెప్పుకొచ్చాడు.