దిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతులు కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తిపరమైన పనుల రీత్యా బుధవారం అర్ధరాత్రి దిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తాజాగా ట్వీట్ చేశారు.’అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు.
ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ‘ అని రాజమౌళి ట్వీట్ చేశారు.