పూనమ్ కౌర్..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. సినీ నటిగా కంటే కూడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. ప్రతినిత్యం సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయాలపై పూనం కౌర్ స్పందిస్తూ వుంటారు. తాజాగా ‘‘Fibromyalgia’’ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన కండరాల నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతం కేరళలో వున్న పూనంకౌర్కు అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ప్రస్తుతం Fibromyalgia నుంచి కోలుకునేందుకు పూనమ్ కౌర్ శ్రమిస్తున్నారు.
వ్యాయామాలు, టాకింగ్ థెరపీలే దీనికి మందులుగా వైద్యులు చెబుతున్నారు..పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి జీవితాంతం వుంటుందని తెలిపారు. తాను పూణేకి తిరిగి వచ్చానని, రెండేళ్లుగా తనను విపరీతంగా ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం వున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే..!!