బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సుమారు 400 రోజులే మిగిలి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తారా, వేయరా అనే విషయాన్ని పక్కనపెట్టి ముస్లింలు సహా మైనారిటీలందరికీ చేరువ కావాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం అందుతుంది..
కాగా ఈ సమావేశంలో అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ప్రధానమంత్రి మోడీ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా దేశమంతటా పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రింబవళ్లు మనమంతా కష్టపడుతున్నామని, కానీ మనలో కొందరు మనకు సంబంధంలేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అదే వ్యాఖ్యలు టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయని, దీనివల్ల పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందన్నారు. అందుకే అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టిగా చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఏ సినిమా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన పఠాన్ చిత్రంపై వివాదం జరుగుతున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది..!!