జానీ సినిమాతో దర్శకుడిగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న పవన్.. ఆ తర్వాత తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ప్రొడక్షన్లో సత్యాగ్రహి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా చేశారు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. ప్రారంభోత్సవానికే పరిమితమై షూటింగ్ దశకు వెళ్లలేదు.
కానీ ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ పవన్ ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఆ కథ ఆయన్ని వెంటాడుతున్నట్లే కనిపిస్తుంటుంది. తాజాగా పవన్ మరోసారి సత్యాగ్రహి ప్రస్తావన తెచ్చాడు. సత్యాగ్రహి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు పవన్. ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ నడిపిన ఉద్యమ స్ఫూర్తిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా చెప్పాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ సినిమాను మొదలుపెట్టామని..
2003లో ప్రారంభోత్సవం జరిపాక ఈ సినిమాను ఆపేశామని పవన్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాలో చేయాలనుకున్నది నిజ జీవితంలో చేయాలన్న ఉద్దేశంతోనే సినిమాను ఆపేసినట్లు పవన్ చెప్పడం విశేషం. సినిమాలో మాటలతో చెప్పడం కంటే నిజ జీవితంలో చేతల్లో చూపించడం ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ వ్యాఖ్యానించాడు.