ఆహా అనిపిస్తున్న బాలయ్య టాక్ షో.. `అన్ స్టాపబుల్`. ఒకటో సీజన్ సూపర్ డూపర్ హిట్టయిపోయింది. ఇప్పుడు సీజన్ 2 కూడా గ్రాండ్ గా మొదలైంది. తొలి ఎపిసోడ్ కే నారా చంద్రబాబు నాయుడు – లోకేష్‌ని దించి – గరం గరంగా మొదలెట్టాడు బాలయ్య. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్‌లు వచ్చారు. రెండో ఎపిసోడ్ త్వరలోనే టెలీకాస్ట్ కాబోతోంది. ఈ షోకి పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్‌లు వస్తారని ఓ ప్రచారం జరగుతోంది. అది కేవలం ప్రచారం మాత్రమే అని అంతా కొట్టి పడేశారు. అయితే.. దాన్ని బాలయ్య అండ్ టీమ్ నిజం చేస్తోంది..రెండో ఎపిసోడ్ విడుదల సందర్భంగా… ఓ ప్రోమో రిలీజ్ చేసింది అన్ స్టాపబుల్ టీమ్.
ఇందులో షోలోనే బాలయ్య..త్రివిక్రమ్ కి ఫోన్ చేసి అన్ స్టాపబుల్ కి ఎప్పుడు వస్తున్నావ్? అని అడిగాడు. `మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా` అని త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు. `ఎవరి తో రావాలో తెలుసుగా` అని బాలయ్య కౌంటర్ వేశాడు. అంటే.. ఈ షోకి పవన్, త్రివిక్రమ్‌లు రావడం దాదాపు ఖాయమే అనుకోవాలి. ఈ ఎపిసోడ్ ని త్వరలోనే షూట్ చేసి, జనవరి 1.. నూతన సంవత్సర కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ తోనే సీజన్ 2ని గ్రాండ్ గా ముగించాలన్నది నిర్వాహకుల ఆలోచన. అదే జరిగితే.. అన్ స్టాపబుల్ 2… సూపర్ సక్సెస్ అయినట్టే.