1988 వ సంవత్సరంలో వచ్చిన ” నవభారతం ” సినిమా షూటింగ్ లో జరిగిన ఒక సరదా సంఘటన నటుడు పి.ఎల్. నారాయణ గారి ప్రాణం మీదకు తెచ్చింది, నిర్మాత పోకిరి బాబు రావు కి చెమటలు పట్టించింది. ఒంగోలు పట్టణానికి దూరంగా ఒక మారుమూల పల్లెలో షూటింగ్ కోసం అందరు చేరుకున్నారు, హీరో రాజా శేఖర్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కోసం తెచ్చిన డమ్మీ పిస్టల్ తో పి.ఎల్. నారాయణ గారు ప్రక్కన ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ ని బెదిరిస్తున్నారు, అతను కంగారు పడి గోల చేయటం మొదలెట్టాడు. అసలే షూటింగ్ ఆలస్యం అవటం తో విసుగ్గా ఉన్న పోకిరి బాబు రావు గారు ఆ పిస్టల్ తీసుకొని వాడిని కాదు మామ, నిన్ను కాలిస్తే గొడవ పోయిద్ది అని పి.ఎల్. నారాయణ గారి గొంతు దగ్గర పెట్టి బెదిరించారు సరదాగా. కాల్చు అల్లుడు నీ చేతుల్లో చావటం కంటే ఏం కావాలి అంటూ బాబు రావు ను రెచ్చ్చగొట్టారు పి.ఎల్. డమ్మీ పిస్టలే కదా అని ట్రిగ్గర్ నొక్కారు బాబు రావు.
అంతే పాయింట్ బ్లాంక్ లో షూట్ చేయటం వలన పిస్టల్ లో ఉన్న ఎయిర్ ప్రెషర్ వలన పి.ఎల్.గారి గొంతు మీద గాయం అయింది, రక్తం ఫౌంటెన్ లాగా బయటకు వచ్చింది, అది చూసిన బాబు రావు గారికి కాళ్ళు, చేతులు చల్లబడిపోయాయి, షూటింగ్ స్పాట్ లో కలకలం. ఇంతలో స్పాట్ కి వచ్చారు రాజశేఖర్, ఆయన స్వతహాగా డాక్టర్ కదా పి.ఎల్. గారిని పరీక్షించి కంగారు పడవలసింది ఏమి లేదని ఫస్ట్ ఎయిడ్ చేసి, వెంటనే ఒంగోలు హాస్పిటల్ కు తరలించారు, అక్కడి డాక్టర్స్ చిన్న ఆపరేషన్ తో పి.ఎల్.గారికి ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడారట. ఒక సరదా సంఘటన ప్రాణాంతకం కాకుండా పి.ఎల్. నారాయణ బయట పడటం తో అందరు ఊపిరి పీల్చుకున్నారట, ముఖ్యంగా పోకిరి బాబు రావు గారు.